- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘సాయి విడుదలై ఏడు నెలలు కూడా కాలేదు. మేం మనసు విప్పి మాట్లాడుకున్నదీ లేదు. కంటి నిండా చూసుకున్నదీ లేదు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది ’’ అంటూ ఆవేదనకు గురయ్యారు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత.
దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబరు 12న కన్నుమూశారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన్ను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్లపాటు జైలులోనే ఉన్న ఆయన 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన ఏడు నెలల్లోనే అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా కన్నుమూశారు .
సాయిబాబాకు భార్య వసంత, కుమార్తె మంజీర ఉన్నారు.
ఆయన మృతి పట్ల భారత్‌లోని ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు సంతాపం ప్రకటించారు.
‘‘జైలు నుంచి వచ్చాక నాన్న ఎప్పుడూ ఒకటే కోరుకునేవారు..మళ్లీ క్లాస్ రూమ్‌కు వెళ్లాలి పాఠాలు చెప్పాలని... పాఠాలు చెప్పడం ఆయన అభిరుచి. క్లాస్ రూమ్‌కు వెళ్లక ముందే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు’’ అన్నారు సాయిబాబా కుమార్తె మంజీర.
జైలుకు వెళ్లడానికి ముందు ఆయన దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.
దాదాపు పదేళ్లు జైలులో గడిపి, నిర్దోషిగా విడుదలయ్యాక కొన్ని నెలలకే ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
జెహనాబాద్ జైల్ బ్రేక్: భారతదేశపు అతిపెద్ద జైల్ బ్రేక్ ఘటనలో ఆ రోజు ఏం జరిగింది?
‘నేను జైలులోనే చనిపోతానని అధికారులు అనుకున్నారు’ - నిర్దోషిగా విడుదలయ్యాక జీఎన్ సాయిబాబా ఏం చెప్పారంటే..
‘ఇక నీతో సమయం గడుపుతా అన్నారు’
ఆల్వాల్‌లోని సాయిబాబా కుటుంబం నివసించే అపార్టుమెంట్‌కు బీబీసీ వెళ్లింది.
నాలుగో అంతస్తులోని వారి ఫ్లాట్‌లోకి అడుగుపెట్టగానే సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. బంధువులు, స్నేహితులు వచ్చి వసంత, మంజీరను పలకరించి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
2014 నుంచి జైలులోనే ఉన్న జీఎన్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, బీపీ తదితర సమస్యలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
‘‘మంజీరా.. చిన్నప్పట్నుంచి నీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. ఇప్పటినుంచి నీతో ఎక్కువ సమయం గడుపుతాను. ఏదైనా ఒక అంతర్జాతీయ సెమినార్‌కు విదేశాలకు వెళ్దాం. కుటుంబమంతా కలిసి ఒడిశాలోని కోణార్క్‌కు వెళ్దాం.. ఇలా ఎన్నో చెప్పేవారు. ఆరోగ్యం బాగయ్యాక అన్నీ చేద్దామని చెప్పేవారు. పదేళ్లపాటు జైలులో ఆయనకు సరైన చికిత్స అందలేదు. ఏదైనా సమస్య తలెత్తితే ఆసుపత్రికి తీసుకెళ్లినా టెస్టులు చేసేవారే కానీ, చికిత్స అందించేవారు కాదు. భరించలేని నొప్పి అంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇచ్చేవారు’’ అని చెప్పారు మంజీర.
పదేళ్ల తర్వాత కళ్లారా చూశా!
జైలులో ఉన్న పదేళ్లలో సాయిబాబాను చూసేందుకు కుటుంబసభ్యులకు ఎక్కువగా వీలుపడేది కాదు.
ములాఖత్ సమయంలో ఒకవైపు కుటుంబసభ్యులు, మరోవైపు సాయిబాబా ఉండేవారు. మధ్యలో ఫైబర్ గ్లాస్ అడ్డుగా ఉండేది. ఫోన్ ద్వారానే మాట్లాడుకోవాల్సి వచ్చేది.
‘‘నాన్నను అరెస్టు చేసినప్పుడు నాకు 12ఏళ్లు. జైలుకు వెళ్లినప్పుడు ఆయన సరిగ్గా కనిపించేవారు కాదు. ఫైబర్ గ్లాస్‌పై గీతలు, మరకలు ఉండేవి. ఆయన్ను స్పష్టంగా చూసేందుకు వీలయ్యేది కాదు. ఆయన్ను కళ్లారా చూసింది జైలు నుంచి విడుదలయ్యాకే’’ అని కుమార్తె మంజీర అన్నారు.
‘సాయి.. నా చిన్ననాటి స్నేహితుడు. 15ఏళ్ల వయసు నుంచే మా ఇద్దరికి పరిచయం ఉంది. సాయికి ఇంగ్లిష్ మీద బాగా పట్టు ఉండేది. నాకు ఇంగ్లిష్ వ్యాకరణం నేర్పించేవారు. నేను గణితం చెప్పేదాన్ని. ఆయన చేతిరాత కూడా బాగుండేది. అప్పట్లో అలిశెట్టి ప్రభాకర్, శ్రీశ్రీ, గురజాడ, ప్రేమ్ చంద్ వంటివారి రచనలు, కవితలు చదివి సమీక్షించుకునేవాళ్లం. ఆ పరిచయం ప్రేమగా మారింది. 1991లో హైదరాబాద్‌కు వచ్చి రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాం. అప్పటినుంచి ఆయన్ను చూడకుండా, మాట్లాడకుండా ఉన్న రోజే లేదు. అలాంటిది 2014 నుంచి ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మానసికంగా చాలా నలిగిపోయాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు వసంత.
తెలంగాణ పోలీసుల ‘రహస్య’ కేసు: ఐపీఎస్‌లకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ పై తీవ్రవాదం కేసు ఏమిటీ, ఎందుకు వెనక్కు తగ్గారు?
ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 42 ఏళ్లు: ఇది ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ
సోనీ సోరీ: రాజద్రోహం కేసులో నిర్దోషి, ‘కానీ ఆ చట్టం ఆమె జీవితంలో 11 ఏళ్లను మింగేసింది’
యూనివర్సిటీకి అర్జీ పెట్టుకున్నాం
సాయిబాబా అరెస్టయ్యాక రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. సాయిబాబా నిర్దోషిగా విడుదలయ్యాక ఉద్యోగంలోకి తీసుకోవాలని యూనివర్సిటీని, రామ్‌లాల్ ఆనంద్ కాలేజీని కోరినట్లు చెప్పారు వసంత.
‘‘చిన్నప్పట్నుంచి బోధన వైపు రావాలని సాయి తాపత్రయపడ్డారు. తనకు బోధన అనేది వృత్తిగా కాకుండా జీవితంలో ఒక భాగం అనుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని మేం యూనివర్సిటీ వీసీ, కాలేజీ ప్రిన్సిపాల్‌కు లెటర్ ఇచ్చాం. పదేళ్ల నుంచి ఆయనకు చట్టపరంగా అందాల్సిన ప్రయోజనాలు ఇవ్వాలని అడిగాం. ఇప్పటివరకు కాలేజీ నుంచి మాకు జవాబు అందలేదు. నేను ఆయన మీదే ఆధారపడి ఉన్నా. కారుణ్య నియామకం కింద మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి’’ అని కోరారు వసంత.
దీనిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆమె బీబీసీకి చెప్పారు.
‘‘మళ్లీ ఆయన పాఠాలు చెప్పలేకపోయారు. అందుకే చనిపోయినా సరే ఆయన శరీరం ద్వారా పాఠాలు చెప్పడానికి గాంధీ మెడికల్ కాలేజీకి సాయిబాబా దేహాన్ని ఇచ్చాం’’ అని ఆమె చెప్పారు.
సాయిబాబా చనిపోయిన తర్వాత ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి, శరీరాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేశారు.
సుధా భరద్వాజ్: ప్రముఖ సామాజిక కార్యకర్త జైలు జీవితం ఎలా గడిచిందంటే..
భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలకు నేటితో నాలుగేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
జమ్మూకశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో వ్యాపారుల మృతిపై న్యాయ విచారణ
‘ఆ పుస్తకం తీసుకువస్తాం’
జైలు జీవిత అనుభవాల గురించి పుస్తకం రాయాలని భావించినట్లు గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎన్ సాయిబాబా చెప్పారు.
‘‘పుస్తకాన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభిద్దామని అనుకున్నారు. అందుకు అమ్మ, నేను సాయం చేస్తామని చెప్పాం. ఆదివాసీ పిల్లల కోసం ఒక పాఠశాల పెట్టాలని కూడా అనుకున్నారు. తను చేసిన పీహెచ్‌డీ థీసీస్‌ను పుస్తకంగా తీసుకువద్దామనే ప్రణాళిక ఉండేది. 2014లోనే అనుకున్నప్పటికీ, అరెస్టు వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు దాన్ని ఫుస్తకంగా తీసుకురావడమే మా భావి కార్యక్రమం’’ అని చెప్పారు మంజీర.
ఇక సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులతో ఏర్పడిన ‘‘కమిటీ ఫర్ ది డిఫెన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ సాయిబాబా’’ ఆయన విడుదలకు కృషి చేసింది.
ఆయన చనిపోయిన తర్వాత వివిధ దేశాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు సంతాప సందేశం పంపించాయి.
భారత్‌లోని ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు వేరువేరుగా సాయిబాబా కుటుంబానికి సంతాప సందేశం పంపించారు.
‘‘సాయిబాబా ప్రజా ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు. మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా భారత్ సహా ప్రపంచదేశాల్లోనూ గుర్తింపు సాధించారు. ఈ క్లిష్ట సమయంలో మీకు మా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం’’ అని వారు సంతాప సందేశంలో పేర్కొన్నారు.
అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, కొలంబియా కమ్యూనిస్ట్ యూనియన్, గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ, బ్రెజిల్ కమ్యూనిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ రివల్యూషనరీస్ ప్రతినిధులు సంతాప సందేశం పంపించినట్లు సాయిబాబా కుమార్తె మంజీర వివరించారు.
సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ కంప్యూటర్లే కాకుండా మరికొందరి కంప్యూటర్లూ హ్యాక్ అయ్యాయా?
'స్టాన్ స్వామి కస్టోడియల్ డెత్‌కు ప్రభుత్వానిదే బాధ్యత', వెల్లువెత్తుతున్న విమర్శలు
భీమా కోరెగావ్ కేసులో సాక్ష్యాధారాలను 'ప్లాంట్' చేశారన్న వాషింగ్టన్ పోస్ట్
‘‘రాజ్యం చేసిన హత్య..’’
ఉపా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల నేతలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ప్రొఫెసర్ సాయిబాబాది రాజ్యం చేసిన హత్య అని అభిప్రాయపడ్డారు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ ఏపీ కన్వీనర్ చిలుకా చంద్రశేఖర్.
‘‘ఆదివాసీ ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం కూడగట్టినందుకే సాయిబాబాపై ప్రభుత్వం కక్షగట్టి జైలు పాలు చేసింది. జైల్లో వైద్యం చేయించకుండా వేధించడంతోనే బయటకు వచ్చాక ఆయన మరణించే పరిస్థితి ఏర్పడింది’’ అని చంద్రశేఖర్ అన్నారు.
ప్రజల తరఫున గొంతెత్తిన సాయిబాబాను రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘సాయిబాబా మరణం మొత్తంగా సమాజానికి, పౌరహక్కుల ఉద్యమానికి తీరని లోటు. ప్రజా ఉద్యమానికి ఆయన జీవితం అంకితం. ఆయన నడవలేకపోయినా సమాజానికి, ఉద్యమాలకు నడక నేర్పారు.’’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు.
సాయిబాబా మృతి పట్ల ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ‘‘పోరాటానికి ప్రతీకగా సాయిబాబా నిలిచారు. ఒక ప్రశ్న లేవనెత్తినందుకు, ప్రజాస్వామిక వాతావరణం కోసం గొంతు విప్పినందుకు ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అణచివేత కారణంగా జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వం కనీస మానవత్వాన్ని కూడా చూపించలేదు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది’’ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి.యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)